Army: ఆర్మీ కొత్త యూనిఫామ్ పై రగడ.. తయారీ కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటున్న ఓసీఎఫ్ ఉద్యోగులు
- 13 లక్షల సైనికులకు కొత్త యూనిఫామ్
- ఓపెన్ టెండర్ పిలిచేందుకు ఆర్మీ ఆసక్తి
- దీన్ని వ్యతిరేకిస్తున్న క్లాతింగ్ ఫ్యాక్టరీలు
దేశ సైనికుల కోసం కొత్త యూనిఫామ్ ను అభివృద్ధి చేయగా.. దీని తయారీ కాంట్రాక్టు విషయమై రాద్ధాంతం నడుస్తోంది. కొత్త డిజైన్ తో యూనిఫామ్ ను అమల్లోకి తీసుకురావాలని ఆర్మీ నిర్ణయించింది. దీంతో తయారీ కాంట్రాక్టును తమకే ఇవ్వాలని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు (ఓసీఎఫ్) డిమాండ్ చేస్తున్నాయి.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (నిఫ్ట్) సంస్థ సహకారంతో రూపొందించిన కొత్త యూనిఫామ్ ను ఈ నెల 15న ఆర్మీడే సందర్భంగా ప్రదర్శించారు. ప్రస్తుత యూనిఫామ్ మాదిరే పోలికలు కనిపించినప్పటికీ, కొత్తదనం మాత్రం ఉందనే చెప్పాలి. 13 లక్షల మంది సైనికులకు యూనిఫామ్ ను అందించాల్సి ఉంటుంది. దీంతో ఇది పెద్ద కాంట్రాక్టు కానుంది.
కనుక బహిరంగ టెండర్ ను పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇవ్వాలని ఆర్మీ యోచన. దీనివల్ల వ్యయం తగ్గుతుందని భావిస్తోంది. దీన్ని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్ర సర్కారు అనుకూలంగా ఉన్నాయంటూ ఆవాడి ఫ్యాక్టరీ ఆరోపించింది. ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు మనుగడ సాగించాలంటే వాటికి ఆర్డర్లు అవసరమని, పోరాట దళాల యూనిఫామ్ ల తయారీలో వాటికి మంచి అనుభవం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.