West Godavari District: 365 రకాల వంటకాలతో కాబోయే వధూవరులకు తాతయ్య సంక్రాంతి విందు
- భీమవరానికి చెందిన కుందవికి తణుకుకు చెందిన సాయికృష్ణతో వివాహ నిశ్చయం
- సంక్రాంతికి ఇంటికి ఆహ్వానించిన కుందవి తాతయ్య
- ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారిన విందు
సంక్రాంతికి ఇంటికొచ్చిన కాబోయే వధూవరులకు జీవితంలో మర్చిపోలేని విందు ఇచ్చారో తాతయ్య. ఏకంగా 365 రకాల వంటకాలతో వడ్డించిన ఈ విందు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం మాధవి-వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకు పట్టణానికి చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో వివాహం నిశ్చయమైంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా వధూవరులను తన ఇంటికి ఆహ్వానించారు నరసాపురం పట్టణానికి చెందిన కుందవి తాతయ్య ఆచంట గోవిందు-నాగమణి దంపతులు. ఇంటికి వచ్చిన కాబోయే జంటకు జీవితాంతం గుర్తుండేలా విందు ఇచ్చారు. 365 రకాల వంటకాలను వడ్డించారు. 100 రకాల స్వీట్స్, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలు, రకరకాల పిండి వంటలను రుచి చూపించారు. తాతయ్య ఇచ్చిన విందుకు వధూవరులు ఫిదా అయిపోయారు. తాతయ్య తమపై చూపించిన ప్రేమాభిమానానికి కుందవి, సాయికృష్ణ కదిలిపోయారు.