Rafael Nadal: ఈ సర్కస్ ఫీట్లు చూసి అలసిపోయా.. జకోవిచ్ వ్యవహారంపై నాదల్
- తీసుకునే నిర్ణయాలకు పర్యవసానాలు తప్పవు
- వ్యాక్సినేషన్ ను నేను బలంగా నమ్ముతాను
- జకోకు ఆల్ ద బెస్ట్ మాత్రమే చెప్పగలను
సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్ ఆస్ట్రేలియా వీసా వివాదంపై స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ స్పందించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం మెల్ బోర్న్ కు వచ్చిన అతడు ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యవహారంపై మాట్లాడాడు. ‘సర్కస్ ఫీట్లు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘జకోవిచ్ ను నేను గౌరవిస్తాను. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలకు తీవ్రమైన పర్యవసానాలు తప్పవు. ప్రజల ముందు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి’’ అని వ్యాఖ్యనించాడు.
కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండానే దేశంలోకి వచ్చాడని పేర్కొంటూ రెండు సార్లు జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జకోవిచ్ .. ఆస్ట్రేలియా సరిహద్దు అధికారుల నిర్బంధంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ 'సర్కస్ ఫీట్లు' వ్యవహారాలను చూసిచూసి అలసిపోయానంటూ నాదల్ కామెంట్ చేశాడు.
‘‘నేను కేవలం ఆటగాడిని. జకోవిచ్ వీసా వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టుంది. జకోకు ప్రస్తుతం నేను ఆల్ ద బెస్ట్ మాత్రమే చెప్పగలను. అంతే. నేను నా ఆట ఆడాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు. తాను కరోనా వ్యాక్సినేషన్ ను బలంగా నమ్ముతానని, ఇలాంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రముఖుల నిర్ణయాలు కచ్చితంగా ప్రజలపై ప్రభావం చూపిస్తాయని అన్నాడు. వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దానిని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని, టెన్నిస్ కు, టెన్నిస్ ఆటగాళ్లకు అది చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.