Volcano: పసిఫిక్ మహాసముద్రంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం... పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

Huge volcanic eruption in Pacific Ocean

  • టోంగాకు సమీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం
  • 8 నిమిషాల పాటు పేలుడు
  • 800 కిమీ దూరంలోని ఫిజీ వరకు వినిపించిన శబ్దాలు
  • ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న అధికారులు

పసిఫిక్ మహాసముద్రం, అందులోని ద్వీపదేశాలు అనేక అగ్నిపర్వతాలకు నెలవు. తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో టోంగాకు సమీపాన ఓ భారీ అగ్నిపర్వతం (హుంగా టోంగా-హుంగా హాపై) బద్దలైంది. దీని ప్రభావంతో టోంగా రాజధాని నుకులోఫాపై పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు ఏర్పడ్డాయని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ పేర్కొంది.

ఈ అగ్నిపర్వత విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయి. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో ప్రకటనలు జారీ అయ్యాయి.

కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News