Bishop Franco Mulakkal: నన్ పై అత్యాచారం కేసు.. బిషప్ ఫ్రాంకో ములక్కల్ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!
- నన్ పై పలుమార్లు అత్యాచారం చేశారంటూ బిషప్ ఫ్రాంకోపై అభియోగాలు
- ఆయన ఏ తప్పూ చేయలేదన్న కోర్టు
- కోర్టు తీర్పు షాక్ కు గురిచేసిందన్న కొట్టాయం జిల్లా ఎస్పీ
నన్ పై 2014 నుంచి 2016 మధ్య కాలంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బిషప్ ఫ్రాంకో మలక్కల్ కు కేరళలోని కోర్టులో ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. 'ఆయన ఏ తప్పూ చేయలేదు' అంటూ సింగిల్ లైన్ లో జడ్జ్ మెంట్ ఇచ్చింది. అత్యాచారం ఆరోపణలతో మన దేశంలో అరెస్ట్ అయిన తొలి బిషప్ ఫ్రాంకో కావడం గమనార్హం.
ఆయనపై అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, బలవంతపు నిర్బంధం కింద కేసు నమోదయింది. దాదాపు 100 రోజులకు పైగా కేసును విచారించిన కొట్టాయంలోని కోర్టు ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ, నిర్దోషిగా ప్రకటించింది.
మరోవైపు కోర్టు తీర్పుపై కొట్టాయం జిల్లా ఎస్పీ హరి శంకర్ స్పందిస్తూ... తీర్పు తనను షాక్ కు గురిచేసిందని చెప్పారు. బిషప్ కు వ్యతిరేకంగా ఆధారాలన్నీ చాలా బలంగా ఉన్నాయని... సాక్షులు కూడా వ్యతిరేకంగా మారలేదని అన్నారు.