BJP: స్నానం చేస్తోన్న వ్యక్తి వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించిన బీజేపీ నేత.. వీడియో ఇదిగో
- ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతానీ ప్రచారం
- బాగున్నారా? అంటూ పలకరించిన నేత
- స్నానం చేస్తున్నప్పుడూ వదలరా? అంటూ నెటిజన్ల సెటైర్లు
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇంటింటి ప్రచారం చేపడుతూ ప్రజల మీద ప్రేమ ఎన్నడూలేని విధంగా కురిపిస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు.
కాన్పూర్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతానీ ఇలాంటి ప్రయత్నమే చేస్తూ ఇంటి ముందు స్నానం చేస్తున్న ఓ వ్యక్తిని ఓటు అడిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. స్నానం చేస్తున్నప్పుడు కూడా ఓటర్లను వదలరా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఓ ఓటరు ఇంటి ఆరుబయట స్నానం చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన సురేంద్ర అతనితో అక్కడే మాట్లాడారు. ఎలాగున్నారు? మీ గృహ నిర్మాణ పనులు పూర్తయ్యాయా? అని అడిగారు. స్నానం చేస్తోన్న ఆ ఓటరు సబ్బు రుద్దుకుంటూనే బీజేపీ నేతకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ ఎమ్మెల్యే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్వయంగా పోస్ట్ చేశారు.
తాము అమలు చేస్తోన్న హౌసింగ్ స్కీమ్ కింద ఆ వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారని, అందుకే ఆయన వద్దకు వెళ్లి అభినందించానని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.
బహిరంగ ప్రచారాలపై ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. వర్చువల్ విధానంలో ప్రచారం చేసుకునే విషయంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.