Natti Kumar: సమయాన్ని పెంచండి.. సెకండ్ షో వేసుకుంటాం: జగన్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ

Producer Natti Kumar writes letter to CM Jagan
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే
  • 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్మాతలు, థియేటర్ ఓనర్లు నష్టపోతారు
  • పండుగ నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతినివ్వండి
ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య అంతరం నెలకొంది. మంత్రి పేర్ని నానితో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపినా సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ కూడా క్రమంగా తగ్గుతోంది.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ కేవలం 50 శాతం మాత్రమే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. అంటే సెకండ్ షో వేసే అవకాశం కూడా ఉండదు.  

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు నిర్మాత నట్టి కుమార్ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని... అందులో భాగంగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించిందని లేఖలో పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని... అయితే పండుగ సీజన్లో సినిమాలకు కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయని.. ఈ సీజన్లో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే నిర్మాతలు, థియేటర్ యజమానులు నష్టపోతారని చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా వారం రోజుల పాటు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిని ఇవ్వాలని కోరారు.

రాత్రి పూట 11 గంటల వరకు కాకుండా 12 గంటల వరకు గడువు పెంచాలని... దీని వల్ల సెకండ్ షో వేసుకునే అవకాశం లభిస్తుందని నట్టి కుమార్ కోరారు. పరిశ్రమలోని పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ బాగుండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు.
Natti Kumar
Tollywood
Jagan
YSRCP
Letter

More Telugu News