Yogi Adityanath: ఇది 80 వెర్సస్ 20 పోటీ: యోగి ఆదిత్యనాథ్
- ఉత్తమ పాలన కోరుకునేవారు 80 శాతం
- మాఫియా మద్దతుదారులు, రైతు వ్యతిరేకులు 20 శాతం
- ఈ పోటీలో మార్గం చూపించేది కమలమే
- ఓ కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఎన్నికలను 80/20 శాతం మధ్య పోరాటంగా పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు మొదలు కానున్న తెలిసిందే. ఈ సందర్భంగా లక్నోలో ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు.
‘‘80 శాతం మంది జాతీయతను సమర్థించేవారు. ఉత్తమ పరిపాలన, అభివృద్ధికి మద్దతు పలికేవారు. అటువంటి వారు బీజేపీకే ఓటు వేస్తారు. దీనికి వ్యతిరేకులు, మాఫియా మద్దతుదారులు, నేరస్థులు, రైతు వ్యతిరేకులు. ఇలాంటి 15-20 శాతం మంది వేరే మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ 80-20 పోరులో మార్గాన్ని చూపించేది కమలమే’’ అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలకు చోటు లేదంటూ గతంలోనూ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ‘‘2017కు ముందు ప్రతి ఒక్కరికీ రేషన్ అందిందా? అబ్బాజాన్ (అఖిలేశ్) అని అన్న వారికే రేషన్ లభించింది’’ అని అన్నారు.