Prime Minister: నిరసన కారులతో కలిసి అక్కడి పోలీసులు టీ తాగారు.. సుప్రీంలో 'ప్రధాని భద్రతా వైఫల్యం'పై సొలిసిటర్ జనరల్

Police Having Tea With Protestors SG Argues In SC

  • కాన్వాయ్ లోని వార్నింగ్ కారుకూ విషయం చెప్పలేదు
  • ప్రధాని పర్యటనకు ముందే సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ బెదిరింపులు
  • ఇది అంతర్జాతీయ ఉగ్రవాద చర్య కూడా అయి ఉండొచ్చు
  • ఎన్ ఐఏ అధికారి ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలి
  • సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వాదనలు

దేశ ప్రధాని కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సదరు రాష్ట్ర డీజీపీతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లు చేస్తారని, ఆయన క్లియరెన్స్ ఇచ్చినప్పుడే కాన్వాయ్ కదులుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, పంజాబ్ డీజీ ఇన్ చార్జ్ అలాంటి హెచ్చరికలేవీ చేయలేదని, దాని ఫలితంగా అంతర్జాతీయ సమాజం తలదించుకునే ఘటన జరిగిందని అన్నారు.

ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫ్యలంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పీఎం కాన్వాయ్ వెళ్లేటప్పుడు ముందు వార్నింగ్ కార్ బయల్దేరుతుందన్న తుషార్ మెహతా.. నిరసనకారులతో కలిసి అక్కడి పోలీసులు టీ తాగారని, ఆందోళనకారులు ఫ్లై ఓవర్ ను బ్లాక్ చేశారన్న విషయాన్ని వార్నింగ్ కారుకు ఆ పోలీసులు తెలియజేయలేదని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు.

పంజాబ్ పర్యటనలో ప్రధానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలంటూ 'సిక్స్ ఫర్ జస్టిస్' సంస్థ పిలుపునిచ్చిందని, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. కాబట్టి ఈ ఘటనను తేలిగ్గా రాష్ట్ర విచారణ కమిటీతో దర్యాప్తు చేయించకూడదని వాదించారు. న్యాయవిచారణ జరగకుండా ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందన్నారు. కచ్చితంగా ఎన్ఐఏ అధికారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు.

అయితే, అది జ్యుడీషియల్ కమిషన్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ అయినా ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలకు సంబంధించి అన్ని విషయాలనూ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిందేనని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆ లోపాలపై ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ఐజీ పర్యవేక్షణ చేస్తున్నారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 సొలిసిటర్ జనరల్ వాదనలకు స్పందించిన పంజాబ్ అడ్వొకేట్ జనరల్.. పంజాబ్ పోలీసులపైనే నింద మోపేందుకు కేంద్ర కమిటీ ప్రయత్నాలు చేస్తోందని, పోలీసులిచ్చిన సలహాలను ఎస్పీజీ అధికారులు అనుసరించలేదని అన్నారు. ఘటనపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు.

అయితే, తమ కమిటీ కేవలం ప్రధాని భద్రతా లోపాలకు సంబంధించి ఎవరు.. ఎవరితో ఏం మాట్లాడారన్న విషయాన్ని మాత్రమే దర్యాప్తు చేస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News