Raman Singh: హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.500 కోట్లు వెదజల్లినా టీఆర్ఎస్ ఓడిపోయింది: చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్
- బండి సంజయ్ అరెస్ట్ పట్ల బీజేపీ నేతల్లో ఆగ్రహం
- నియంతృత్వ పాలన అంటూ రమణ్ సింగ్ వ్యాఖ్యలు
- ప్రజలు చరమగీతం పాడతారని వ్యాఖ్య
తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పొరుగు రాష్ట్రాల బీజేపీ నేతల విమర్శల దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం కమలనాథుల్లో ఆగ్రహావేశాలు కలిగించింది. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఈ రోజు కరీంనగర్లో బండి సంజయ్ ని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ ఓటమిపాలైందని విమర్శించారు. ఈ ఓటమి తర్వాత టీఆర్ఎస్ లో అసహనం పెల్లుబుకుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ సర్కారు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదని ఆయన అన్నారు.
తెలంగాణలో నిజాం రజాకార్ల పాలన సాగుతోందని, అయితే, బీజేపీ కార్యకర్తలు బుల్లెట్లు, లాఠీలకు భయపడేవారు కాదని ఉద్ఘాటించారు. దేశ రాజకీయాల్లో ఇంతటి దారుణ ఘటన జరగలేదని, కరీంనగర్ ఎంపీ కార్యాలయం తలుపులు పగులగొట్టి పోలీసులు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కారుకు ఏమాత్రమైనా సిగ్గుంటే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రమణ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తెలంగాణలో పరిస్థితులను గమనించానని వెల్లడించారు. కేసీఆర్ సర్కారుపై ప్రజావ్యతిరేకత ఉందని టీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసని అన్నారు.
కాగా, ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ చేస్తున్న పోరాటానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన రేపు హైదరాబాద్ వస్తున్నారు.