Marais Erasmus: టీమిండియా ఆటగాళ్ల అరుపులకు బెంబేలెత్తిపోయిన దక్షిణాఫ్రికా అంపైర్!
- జోహాన్నెస్ బర్గ్ లో రెండో టెస్టు
- మూడో రోజు ఆటలో ఘటన
- పదేపదే అప్పీల్ చేసిన భారత ఆటగాళ్లు
- మీ అరుపులతో గుండెపోటు వచ్చేలా ఉందన్న అంపైర్
జోహాన్నెస్ బర్గ్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు నాలుగో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారడం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ కు మూడో రోజున ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడు మరాయిస్ ఎరాస్మస్ ఓ దశలో టీమిండియా ఆటగాళ్ల అరుపులకు బెంబేలెత్తిపోయాడు.
బంతి ప్యాడ్లకు తగిలితే చాలు... బౌలర్, వికెట్ కీపర్ సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్క భారత ఆటగాడు బిగ్గరగా అప్పీల్ చేయడం పట్ల ఆయన స్పందించారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు తరచుగా అప్పీల్ చేయడం అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. మీ అరుపులతో గుండెపోటు వచ్చేలా ఉందని ఆయన తగ్గుస్వరంతో అనుకోవడం స్టంప్ మైక్ లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సహజంగానే భారత ఆటగాళ్లు మైదానంలో ప్రతి బంతికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటుంటారు. హిందీలో మనవాళ్ల మాటలు పలు దేశాల అంపైర్లకు అర్థంకాక, అవి రణగొణధ్వనుల్లా అనిపిస్తుంటాయి.