NTR: కపిల్ శర్మ షోలో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నటులు
- కపిల్ శర్మ షోలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, అలియా సందడి
- హిందీలో అదరగొట్టిన తారక్, చరణ్
- స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజి హిందీయేనన్న ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు రాజమౌళి, రామ్ చరణ్, అలియా భట్ కూడా పాల్గొన్నారు. అలియా మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ కు హిందీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని వెల్లడించింది.
ఈ షోలో సీనియర్ నటి అర్చనా పూరన్ సింగ్ కూడా పాల్గొంది. తారక్, చరణ్ హిందీలో అనర్గళంగా మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది. హిందీలో ఇంతా బాగా ఎలా మాట్లాడుతున్నారంటూ అర్చనా ప్రశ్నించింది. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ, స్కూల్లో చదివే రోజుల్లో తన ఫస్ట్ లాంగ్వేజి హిందీ అని తెలిపాడు. తన తల్లి కోరిక మీదే స్కూల్లో ప్రథమ భాషగా హిందీని తీసుకున్నానని వివరించాడు.
అన్నింటికీ మించి హిందీ మన జాతీయ భాష అని పేర్కొన్నాడు. హిందీ ఎక్కువగా మాట్లాడే హైదరాబాదులో పెరగడం వల్ల ఆ భాష బాగా నేర్చుకోగలిగానని వివరించాడు. ముంబయి నుంచి టాలీవుడ్ కు వచ్చే పలువురు టెక్నీషియన్ల ద్వారా కూడా హిందీ మాట్లాడడం మెరుగైందని ఎన్టీఆర్ తెలిపాడు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా వేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనున్నారు.