Komatireddy Venkat Reddy: పైలెట్ కావాలనుకున్న ఆటో డ్రైవర్ కుమార్తె... అండగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి
- ఖర్చుతో కూడుకున్న పైలెట్ కోర్సు
- తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరిన అమృతవర్షిణి
- సాయం కోసం కోమటిరెడ్డిని కలిసిన వైనం
- కోర్సుకయ్యే ఖర్చును భరిస్తానన్న ఎంపీ
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. పైలెట్ కావాలనుకున్న ఓ ఆటోడ్రైవర్ కుమార్తె ఆశయానికి తనవంతు చేయూతనిచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన బోడా అమృతవర్షిణి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ ఆటోడ్రైవర్. పైలెట్ కోర్సు ఎంతో వ్యయభరితం అయినప్పటికీ విమానం నడపాలన్న ఆకాంక్షతో ఆమె పైలెట్ అవ్వాలని నిశ్చయించుకుంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలెట్ గా అడ్మిషన్ సాధించింది.
ఫీజుల రూపంలో ఖర్చులు చాలా ఉండడంతో అమృతవర్షిణి ఆర్థికసాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసింది. ఆయన ఎంతో ఉదారంగా స్పందించి, ఆమె కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలో ఆమెకు రూ.2 లక్షల చెక్ ను అందించారు.
దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ... ఇలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు సాయపడేలా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం తీసుకురాకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఆమె సాయం కోసం అధికార పార్టీ నేతలను చాలామందిని కలిసిందని, కానీ ఎవరూ స్పందించలేదని వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా తాను కర్తవ్యాన్ని నిర్వర్తించానని కోమటిరెడ్డి తెలిపారు. ఓ ఆటోడ్రైవర్ కుమార్తె పైలెట్ అవడాన్ని గర్వంగా భావిస్తానని పేర్కొన్నారు.