Pakistan: సవాల్ విసురుతున్న దాయాది.. రాఫెల్ కు దీటుగా చైనా జే10సీలను కొంటున్న పాక్​!

Pak To Purchase Chinese J10C Fighter Jets In Reply To India Rafale Jets

  • 25 జే10సీలను కొనుగోలు చేస్తున్నట్టు పాక్ హోం మంత్రి ప్రకటన
  • చైనా ‘జేఎస్ 10’ అంటూ తప్పుగా ప్రకటన
  • రాఫెల్ కు బదులుగానేనంటూ కామెంట్
  • రాఫెల్ తో పోలిస్తే జే10సీ శక్తిసామర్థ్యాలు తక్కువే

దాయాది పాకిస్థాన్.. మనకు సవాల్ విసురుతోంది. మన వైమానికదళ పటిష్ఠత కోసం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే దీటుగా చైనా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను పాక్ కూడా కొనుగోలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ హోం శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారు.

‘‘భారత్ రాఫెల్ యుద్ధ విమానాలకు దీటుగా 25 బహుళ ప్రయోజన జే10సీ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. అయితే, తాను ఉర్దూ మీడియంలోనే తన చదువులు పూర్తయ్యాయని చెప్పే ఆయన ఆ యుద్ధ విమానాల పేరునూ సరిగ్గా పలకలేకపోవడం గమనార్హం. జే10సీకి బదులు జేఎస్ 10 అని పలకడంతో పక్కనున్న వాళ్లు సరిచేశారు.

‘‘మార్చి 23న పాకిస్థాన్ దినోత్సవాన తొలిసారి చైనా జేఎస్ 10 యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్ పరేడ్ జరుగుతుంది. పాకిస్థాన్ వైమానిక దళమూ అందులో పాల్గొంటుంది. వీఐపీ అతిథులు ఆ వేడుకకు హాజరవుతారు. భారత్ కొంటున్న రాఫెల్ కు బదులుగానే వీటిని కొనుగోలు చేస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు.

కాగా, గత ఏడాది పాక్–చైనా కలిసి సంయుక్తంగా చేసిన ఎక్సర్ సైజుల్లో జే10సీ యుద్ధ విమానాలూ పాల్గొన్నాయి. దానితో పాటు జే11బీ జెట్లు, కే 500 ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్, వై8 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ల శక్తి సామర్థ్యాలనూ చైనా చూపించింది. జే10సీ శక్తిసామర్థ్యాలను తెలుసుకున్న తర్వాత పాక్ సైనికాధికారులు వాటి కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

అయితే, టెక్నాలజీ, శక్తియుక్తుల్లో  రాఫెల్ తో పోలిస్తే జే10సీ తక్కువేనని నిపుణులు చెబుతుంటారు. రాఫెల్ యుద్ధ విమాన నిర్మాణ తీరు, అధునాతన సెన్సర్లు, ఫైటింగ్ సామర్థ్యాలే ఆ విమానాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయని అంటారు. అంతేగాకుండా ఇంజన్ సామర్థ్యం, అధునాతన షార్ట్ రేంజ్ మిసైల్స్ రాఫెల్ కు అదనపు హంగులు.

కానీ, జే10సీలో అవి కొరవడ్డాయి. ఇటు మీటియోర్ మిసైల్స్ తో కూడిన ఆర్బీఈ2ఏసా రాడార్ వ్యవస్థ ద్వారా.. కంటికి కనిపించనంత దూరంలో ఉన్న టార్గెట్లనూ రాఫెల్ మట్టికరిపించగలదు. ఆ వ్యవస్థ జే10సీలో లోపించింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ రెండింట్లోనూ ఉన్నా.. రాఫెల్ ది అడ్వాన్స్ డ్ అని చెబుతారు.

కాగా,  ప్రస్తుతం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో ఎక్కువగా అత్యంత పాతవైన జే7ఈ విమానాలను వాడుతున్నారు. వాటిని తీసేసి వాటి స్థానంలో జే10సీలను చైనా అందిస్తోంది. అయితే, తైవాన్ ఆక్రమణ వంటి తీవ్రమైన, కీలకమైన విషయాల్లో మాత్రం అత్యంత ఆధునికమైన జే20 యుద్ధ విమానాలను డ్రాగన్ కంట్రీ మోహరిస్తోంది.

  • Loading...

More Telugu News