Karnataka: కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. బీజేపీకి గట్టిపోటీ!

Cong Wins 498 Of 1184 Seats In Karnataka Urban local body Polls

  • 58 పట్టణాల పరిధిలో ఎన్నికలు
  • 1184 వార్డులకు కాంగ్రెస్ ఖాతాలో 498
  • బీజేపీ 437 వార్డుల్లో విజయం
  • ప్రత్యర్థుల విజయాలపై జేడీఎస్ ప్రభావం

కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 437 వార్డుల్లో విజయం సాధించింది. జేడీఎస్ 45, స్వతంత్రులు 204 చోట్ల గెలిచారు.

58 గ్రామ పంచాయితీలకు, 9 పట్టణ స్థానిక మండళ్లకు బైపోల్స్ నిర్వహించారు. వీటి ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బీజేపీ 36.9 శాతం, జేడీఎస్ 3.8 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులకు 17.2 శాతం ఓట్లు లభించాయి.

బీజేపీ కంచుకోటలైన విజయ్ పుర, బెళగావి, చిక్కమగుళూరు జిల్లాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటింది. విజయ్ పుర జిల్లాలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్ మూడింటిని గెలుచుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి గట్టి దెబ్ద తగిలింది. ఆయన నియోజకవర్గం పరిధిలోని బంకపుర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. చాలా చోట్ల విజయం స్వల్ప మెజారిటీతో నమోదైంది. ఫలితాలు తారుమారు కావడంలో జేడీఎస్ ఓటు బ్యాంకు కీలకంగా పనిచేసింది.

ప్రజాతీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. చాలా వరకు ఎన్నికలు పట్టణాల్లో జరిగినందున కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించినట్టు సీఎం బొమ్మై పేర్కొన్నారు. అక్కడ 65 శాతం ఓటు బ్యాంకు మైనారిటీలకు ఉండడం కాంగ్రెస్ కు లాభించినట్టు చెప్పారు.

అయితే, వారు సంతోషపడక్కర్లేదని, తాము గ్రామ పంచాయతీలను ఎక్కువగా కైవసం చేసుకున్నట్టు గుర్తు చేశారు. పట్టణ ఫలితాలు సైతం బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయన్నారు. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో మరింత అభివృద్ది పనులు చేపట్టి, భవిష్యత్తు ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ కానీ, మరే పార్టీ ఆధిపత్యం చూపించిందంటే తాను అంగీకరించబోనని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమార స్వామి అన్నారు. తమ మద్దతు లేకుండా వారు ఏమీ సాధించలేరని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News