Subramanian Swamy: హిందూ దేవాలయాలపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు: సుబ్రహ్మణ్యస్వామి
- తిరుపతి వచ్చిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
- ఓ పత్రికపై దావా వేసినట్టు వెల్లడి
- టీటీడీపై అసత్య కథనం రాశారని ఆరోపణ
- హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నట్టు వెల్లడి
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వెబ్ సైట్ ద్వారా క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. హిందూ దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ హిందూ దేవాలయాలను కించపరిచినా తాను న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. టీటీడీ ఈవో విజ్ఞప్తితో సదరు దినపత్రికపై దావా వేసినట్టు తెలిపారు. ఆ దినపత్రిక క్షమాపణ తెలుపుతూ, రూ.100 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు.
తాను హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి ఉద్ఘాటించారు. దేశంలో అనేక మతాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, భారతదేశం గొప్పదనం అదేనని అన్నారు. గతంలో జొరాస్ట్రియన్లు, యూదులు... ఆధునిక భారతంలో ముస్లింలు, క్రైస్తవులను కూడా సమభావంతో చూస్తున్నామని వివరించారు. తిరుపతి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.