Andhra Pradesh: అమూల్ ఓ కంపెనీ కాదు.. పాలు పోసేవాళ్లే దాని యజమానులు: సీఎం జగన్
- కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువను ప్రారంభించిన సీఎం
- రైతులకు లీటర్ పాలపై అదనంగా రూ.20 లబ్ధి కలుగుతోంది
- మహిళా రైతుల నుంచి 168.5 లక్షల లీటర్లు సేకరించామని వెల్లడి
- 2022 సెప్టెంబర్ నాటికి 17,629 గ్రామాలకు విస్తరిస్తామని ప్రకటన
అమూల్ అనేది ఓ సంస్థ కాదని, పాలు పోసేవారే దాని యజమానులని ఏపీ సీఎం జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాలను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఇవాళ కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ఆయన తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
అమూల్ రాకతో రైతులకు లీటర్ పాలపై రూ.20 వరకు అదనంగా లబ్ధి కలుగుతోందని జగన్ అన్నారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన ట్రయల్ రన్ రైతులకు లాభాలను తెచ్చిపెట్టిందన్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడపల్లో పాలవెల్లువ కార్యక్రమం మొదలైందని, కృష్ణా జిల్లాకూ విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 264 గ్రామాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. దాని వల్ల పాడి రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు.
అమూల్ సంస్థ వచ్చిన ఏడాది కాలంలో 5 జిల్లాల్లోని 30,951 మంది మహిళా రైతుల నుంచి 168.5 లక్షల లీటర్ల పాలను సేకరించామన్నారు. రైతులకు రూ.10 కోట్ల మేర అదనపు లబ్ధి కలిగిందన్నారు. 2022 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల్లో అమూల్ ద్వారా పాలను సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. కాగా, పాల నుంచి చాక్లెట్ ను తయారు చేసే వ్యవస్థ అమూల్ కు ఉందని, ప్రపంచంలో అమూల్ ఎనిమిదో స్థానంలో ఉందని పేర్కొన్నారు.