New Delhi: చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచి మాట్లాడిన వృద్ధుడు!

Man died with Cancer and waken in graveyard in delhi

  • ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్‌లో ఘటన
  • వృద్ధుడు చనిపోయినట్టు నిర్ధారించిన 11 మంది వైద్యులు
  • గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడిన వైనం
  • చితిపై నుంచి ఆసుపత్రికి తరలింపు
  • ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధుడు పరిస్థితి విషమించడంతో మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచి ఇక్కడెందుకున్నానని బంధువులను ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోవడం బంధువుల వంతైంది.

ఢిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆసుపత్రిలో కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సతీశ్ భరద్వాజ్ (62) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. అతడు చనిపోయినట్టు ఏకంగా 11 మంది వైద్యులు నిర్ధారించారు.

సతీశ్ మరణవార్తతో ఘొల్లుమన్న కుటుంబ సభ్యులు ఆపై అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పు అంటించడానికి ముందు నోట్లో గంగాజలం పోశారు. ఆ నీళ్లు నోట్లో పడిన వెంటనే వృద్ధుడిలో కదలిక కనిపించింది. ఆ వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు.

దీంతో షాక్ అయిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆ వెంటనే తేరుకుని అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఆపై నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ సాధారణంగా ఉందని, గుండె మామూలుగానే కొట్టుకుంటోందని తెలిపారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News