Revanth Reddy: కేసీఆర్ సొంత పొలంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారు?: రేవంత్ రెడ్డి
- ధాన్యం కొనుగోలుపై రేవంత్ ధ్వజం
- మోదీ సర్కారుతో టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపణ
- కేసీఆర్ 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారన్న రేవంత్
- రేపు అందరికీ ప్రత్యక్షంగా చూపిస్తానని వెల్లడి
ధాన్యం కొనుగోలు అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం చేసి ఇంకా గద్దెపై ఉంటారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారుగా... మరి సీఎం కేసీఆర్ సొంతపొలంలో పండించిన వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారో చెప్పాలి అని రేవంత్ నిలదీశారు. మీ భూములు పండితే సరిపోతుందా..? రైతులను రాజును చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోన్న మోదీ సర్కారుతో టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. వరి పండించొద్దంటున్న టీఆర్ఎస్ నేతలు ఊళ్లోకి వస్తే చెప్పుతో కొట్టండి అని రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంబిస్తోందని, తాము పండించిన పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులకు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పంటలకు దళారులు ధర నిర్ణయిస్తున్నారని అన్నారు. రైతులను బానిసలుగా తయారుచేయాలని చూస్తే తిరుగుబాటు తథ్యమని హెచ్చరించారు.
వరి వస్తే ఉరే అన్న కేసీఆర్ సొంత వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని ఆరోపించారు. అలాంటిది రైతుల పంటను ఎలా కొనరో చూస్తాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల కుటుంబ సభ్యుల కడగళ్లు వింటుంటే రోజుల తరబడి అన్నం కూడా సహించడంలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబరు 27) మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
వెంకటాపురం-ఎర్రవల్లి మధ్యలో ఉన్న కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో వరిసాగు చేస్తున్న వైనాన్ని రేపు మీడియా మిత్రులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని, ఇంత స్వార్థపూరిత ఆలోచనతో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం మేలు చేస్తుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఫొటోలు చూపిస్తున్నానని, ఇవేవీ బొబ్బిలి, విజయనగరంలో తీసిన ఫొటోలు కావని అన్నారు. రేపు ప్రత్యక్షంగా చూపిస్తానని రేవంత్ తెలిపారు.