Marnus Labuschagne: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకిన ఆసీస్ యువ బ్యాట్స్ మన్
- బ్యాటింగ్ ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
- నెంబర్ వన్ ర్యాంకులో మార్నస్ లబుషేన్
- యాషెస్ లో అదరగొడుతున్న లబుషేన్
- ఏడోస్థానానికి పడిపోయిన కోహ్లీ
వివిధ దేశాలు టెస్టు సిరీస్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఐసీసీ తాజా ర్యాంకులు విడుదల చేసింది. టెస్టుల్లో బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా యువ ఆటగాడు మార్నస్ లబుషేన్ నెంబర్ వన్ ర్యాంకు పొందాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో లబుషాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు. దాంతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇక ఇంగ్లండ్ సారథి జో రూట్ తన నెంబర్ వన్ ర్యాంకును లబుషేన్ కు కోల్పోయాడు. రూట్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 3, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 4వ స్థానంలో ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లో ఇద్దరే ఉన్నారు. రోహిత్ శర్మ ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం పతనమై ఏడో ర్యాంకుకు చేరాడు.
ఇక, టెస్టుల్లో బౌలింగ్ ర్యాంకులు చూస్తే.... ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు.