fake certificates: విదేశీ వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం సర్టిఫికెట్ల తారుమారు.. వరంగల్ పోలీసులకు పట్టుబడ్డ ముఠా
- 12 మంది నిందితుల అరెస్ట్
- ఫెయిలైన విద్యార్థులకూ ఉత్తీర్ణులైనట్టు సర్టిఫికెట్లు
- మార్కులు 90శాతానికి పెంపు
- నకిలీ సర్టిఫికెట్లను పొందిన 212 మంది గుర్తింపు
- ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయిన 62 మంది
విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించాలంటే మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలి. చక్కని ప్రతిభ చూపాలి. కానీ, ఆర్థిక బలం ఉంటే చాలు.. అడ్డదారిలో సీటు సంపాదించుకునే మార్గం మేము చూపిస్తాంటూ ఓ ముఠా చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను వరంగల్ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు.
ఫెయిలైన విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినట్టు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిస్తోంది ఈ ముఠా. అంతేకాదు పాసైన వారికి ఇంకా అధిక మార్కులు వచ్చినట్టు దొంగ సర్టిఫికెట్లను తయారు చేసిస్తోంది. ఇంజనీరింగ్, డిగ్రీ సర్టిఫికెట్ల నకిలీలను సృష్టిస్తున్న 12మంది సభ్యుల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్ టాప్ లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆ వివరాలను వెల్లడించారు.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించేందుకు వీలుగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసిస్తూ.. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1 నుంచి 4 లక్షల వరకు వసూలు చేస్తోంది. మార్కుల శాతాన్ని 90 శాతానికీ పెంచుతోంది. విదేశీ కన్సల్టెన్సీ సంస్థల పేరుతో ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా నుంచి నకిలీ సర్టిఫికెట్లను సంపాదించుకున్న 212 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించగా.. వీరిలో 62 మంది ఇప్పటికే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయారు.