USA: అమెరికాపై ఒమిక్రాన్ పంజా.. వారం రోజుల్లో 3 శాతం నుంచి 73 శాతానికి పెరిగిన కేసులు!

Omicron Cases Surges To 73 Percent In US

  • న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ లలో 90 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసుల నమోదు
  • పెరుగుతున్న కేసులతో అమెరికాలో భయాందోళనలు
  • బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించిన మోడెర్నా

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒమిక్రాన్ దెబ్బకు యూరప్ లోని పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. అగ్రదేశం అమెరికాపై కూడా ఒమిక్రాన్ మహమ్మారి పంజా విసురుతోంది. యూఎస్ లో ఒమిక్రాన్ కేసులు ఊహించని విధంగా భారీగా పెరుగుతున్నాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య 3 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఆ దేశంలో ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవడానికి ఇది చాలు.

గత వారం డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉన్నాయని... కానీ ఈ వారంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ వారం డెల్టా వేరియంట్ కేసులు దాదాపు 27 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పింది. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు అమెరికాలో భయాందోళనలను పెంచుతున్నాయి. కేసులు ఇదే రీతిలో పెరుగుతూ పోతే దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ (హెల్త్ కేర్ సిస్టమ్) తీవ్రంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు.

యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అత్యంత ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలలో 92 శాతం, వాషింగ్టన్ లో 96 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ ఇప్పటికే వేయించుకున్నవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని మోడెర్నా సంస్థ సూచించింది. తమ వ్యాక్సిన్ మూడో డోసు వేసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయని తెలిపింది. తమ వ్యాక్సిన్ల థర్డ్ డోసు ఒమిక్రాన్ ప్రభావాన్ని నియంత్రిస్తుందని ఫైజర్, బయోఎన్ టెక్ సంస్థలు తెలిపాయి.

ప్రజలంతా మాస్కులు ధరించాలని, ఇన్ డోర్స్ లో ఉండాలని సీడీసీ సూచించింది. మరోవైపు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో... ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు పిలిపించాలనే అంశంపై పలు కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జీపీ మోర్గాన్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు తమ కాన్ఫరెన్సులను, కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నాయి. మరోవైపు మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News