Justice Chandru: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ చంద్రు.. తాను ఎవరి పక్షమూ కాదని వివరణ
- నేను జగన్ పక్షమో, చంద్రబాబు పక్షమో కాదు
- రాజధాని విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే చెప్పా
- ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు సరికాాదు
- ‘జై భీమ్’ సినిమా కథకు హీరో నేను కాదు
ఏపీ ప్రభుత్వం నిత్యం హైకోర్టుతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించి ధర్మాసనం ఆగ్రహానికి, విమర్శలకు గురైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు పెదవి విప్పారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఎవరి పక్షమూ కాదని చెబుతూ, వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ చంద్రు మాట్లాడుతూ.. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వారితోపాటు అందరి అభిప్రాయాలను హైకోర్టు వినాలని మాత్రమే చెప్పానని, అందరికీ సమన్యాయం అందించాలనే అన్నానని పేర్కొన్నారు. అయితే, ఇంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం అధికారంలో మనలేరని పేర్కొన్నారు. ‘జై భీమ్’ సినిమా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఈ సినిమా తర్వాత కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు తనకు ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. అయితే, ఆ సినిమా కథకు హీరోను మాత్రం తాను కానని, మద్రాస్ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాయేనని పేర్కొన్నారు. దేశంలోని సెన్సార్ బోర్డులన్నీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులతో నిండిపోయాయని జస్టిస్ చంద్రు విమర్శించారు.