Snake: బెజవాడ ఇంద్రకీలాద్రిపై తిరిగే రెండు పాముల్లో ఒకటి మృతి... శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించిన అధికారులు
- ఇంద్రకీలాద్రిపై పాముల జంట సంచారం
- ఎన్నో ఏళ్లుగా భక్తులతో పూజలందుకున్న పాములు
- చనిపోయిన స్థితిలో పామును గుర్తించిన భక్తులు, అర్చకులు
- దుర్గా ఘాట్ లో అంత్యక్రియలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల మనోభావాలకు సంబంధించి ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం పరిసరాల్లో రెండు పాములు సంచరిస్తున్నాయి. దుర్గామాత ఆలయంలో కనిపించే ఆ పాముల జంటను భక్తులు ఎంతో పవిత్రంగా భావించేవారు. ఆ రెండు పాములకు పూజలు చేసేవారు. ఆలయ అర్చకులు సైతం ఆ పాముల పట్ల భక్తిప్రపత్తులు కనబరిచేవారు.
అయితే అందరినీ తీవ్ర విచారానికి గురిచేస్తూ ఆ రెండు పాముల్లో ఒక పాము మరణించింది. కొండపై చనిపోయిన స్థితిలో ఉన్న పామును భక్తులు, అర్చకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ పాముకు శాస్త్రబద్ధంగా దుర్గా ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతంలో చనిపోయింది కాబట్టి దానికి మనుషులకు జరిపించినట్టే అంత్యక్రియలు జరిపించినట్టు అమ్మవారి ఆలయం వైదిక కమిటీ పేర్కొంది.