Hyderabad: 15 నిమిషాలు ఆల‌స్యంగా సినిమా వేసినందుకు హైద‌రాబాద్‌లోని థియేట‌ర్‌కు రూ.ల‌క్ష జరిమానా

fine on theatre

  • తన సమయాన్ని వృథా చేశారని ఓ వ్య‌క్తి కేసు
  • వాద‌న‌లు ముగించి తీర్పు చెప్పిన వినియోగ‌దారుల కోర్టు
  • ఐనాక్స్‌ లీజర్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు జ‌రిమానా

ప్రేక్ష‌కుల ప‌ట్ల కొన్ని సినిమా థియేట‌ర్ల యాజ‌మాన్యాలు వ్య‌వ‌హ‌రించే తీరు స‌రిగ్గా ఉండ‌దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మ‌డం, సినిమా హాళ్ల‌లో స్నాక్స్ ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచేసి విక్ర‌యిస్తుండ‌డం, ప్రేక్ష‌కుల‌ను లైన్ల‌లో నిల‌బెట్టి సినిమాలు ఆల‌స్యంగా వేస్తుండ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంటాయి. ఇటువంటి చ‌ర్య‌ల‌తోనే విసుగెత్తిపోయిన ఓ వ్య‌క్తి సినిమాను ఆల‌స్యంగా వేసి, త‌న స‌మ‌యం వృథా చేసినందుకు వినియోగాదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. దీంతో సమయానికి సినిమా వేయనందుకు హైద‌రాబాద్‌లోని థియేట‌ర్‌కు రూ.ల‌క్ష జరిమానా ప‌డింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టికెట్ పై ముద్రించిన సమయానికి సినిమాను ప్రారంభించకుండా 15 నిమిషాలు ప్రకటనలు వేసి, తన సమయాన్ని వృథా చేశారని విజయ్ గోపాల్ అనే ఓ వ్యక్తి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. త‌న‌ సమయాన్ని వృథాచేసిన ఐనాక్స్‌ లీజర్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై చ‌ర్య‌లు తీసుకుని త‌న‌కు న్యాయం చేయాల‌ని రెండేళ్ల క్రితం కేసు వేశాడు.

  హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన తాను 2019 జూన్‌ 22న 'గేమ్‌ ఓవర్‌' అనే సినిమా చూడడానికి కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని ఐనాక్స్‌ థియేటర్‌కు వెళ్లాన‌ని చెబుతూ ఆధారాల‌న్నిటినీ స‌మ‌ర్పించాడు. టికెట్‌పై ముద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4.30 గంట‌ల‌లకు ప్రారంభం కావాల్సి ఉండ‌గా, అది సాయంత్రం 4.45 గంట‌ల‌కు ప్రారంభ‌మైంద‌ని చెప్పాడు.

15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్‌ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశాన‌ని, అయితే, ఆయ‌న‌ స్పందించలేద‌ని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్ కు చెప్పాడు. దీంతో ఈ కేసులో  రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్‌ అథారిటీ 'హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌'ను చేర్చారు.

అయితే, తెలంగాణ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్ర‌క్రార‌మే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్‌ యాజమాన్యం సమర్థించుకునే ప్ర‌య‌త్నం ‌చేసింది. త‌మ‌కు ఆర్టికల్‌ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అయితే, ఐనాక్స్‌ సంస్థ వాద‌న‌ల‌ను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది.  

చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక‌, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ.5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక,  లైసెన్సింగ్‌ అథారిటీ అయిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కి పెనాల్టీ కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేట‌ర్ నుంచి వ‌చ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసుల‌కు సూచించింది. 

  • Loading...

More Telugu News