Andhra Pradesh: ప్రభుత్వ హామీతో ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించిన ఏపీ ఉద్యోగులు!
- పీఆర్సీతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యోగుల డిమాండ్
- ఉద్యోగ సంఘాల నేతలతో బుగ్గన, సీఎస్ చర్చలు
- అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ
పీఆర్సీతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టిన సంగతి తెలిసిందే. 70కి పైగా డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ వారు ఆందోళనకు దిగారు. అయితే, ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చర్చలు జరిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. క్రమంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో, ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించారు.