YSRCP: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: వైసీపీ ఎంపీల విమర్శ

YSRCP MPs fires on center

  • విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలి
  • సంక్షేమ పథకాలను విమర్శించేందుకు టీడీపీ, బీజేపీకి నోరెలా వస్తోంది?

విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంటు సమావేశాల అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చడానికి మరో రెండేళ్లలో కాలపరిమితి ముగియనుందని... ఈ నేపథ్యంలో వెంటనే హామీలను నెరవేర్చాలని అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్రం నష్టపరిహారాన్ని విడుదల చేయాలని కోరారు.

అసలు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా విమర్శిస్తున్నారని... ఇది ముమ్మాటికీ పేదల కడుపు కొట్టడమేనని తెలిపారు.

పేదవాడు ఎవరి వద్ద చేయిచాచకుండా, గౌరవంగా బతకడం కోసం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే... వాటిని విమర్శించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. అమరావతి పేరుతో కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News