Cricket: బిల్లు కట్టమంటే కట్టరా?.. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్ చేసిన అధికారులు
- రూ.కోటికి పైగా బిల్లుల పెండింగ్
- నోటీసులిచ్చినా పట్టించుకోని హెచ్ సీఏ
- గతంలో చౌర్యం కేసూ పెట్టిన విద్యుత్ శాఖ
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంట్ కట్ చేసి దిమ్మతిరిగేలా చేసింది. స్టేడియానికి సంబంధించి ఇప్పటిదాకా రూ.కోటికిపైగా కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ కొన్ని నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేశామని ఏడీఈ బాలకృష్ణ తెలిపారు.
వాస్తవానికి బిల్లు కట్టకుండా కరెంటు వాడుకుంటుండడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)పై గతంలో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ చౌర్యం కేసు నమోదు చేశారు. దీనిపై హెచ్ సీఏ కోర్టుకు వెళ్లగా.. విద్యుత్ శాఖకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు చెప్పినా హెచ్ సీఏలో మార్పు రాలేదు. ఇటీవలే విద్యుత్ అధికారులు బకాయిల విషయంపై నోటీసులూ జారీ చేశారు. అయినా, చెల్లించకపోవడంతో అధికారులు కరెంట్ కట్ చేశారు.