Nara Lokesh: ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది: నారా లోకేశ్
- డిమాండ్ల సాధనకోసం ఉద్యోగుల పోరుబాట
- సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం
- అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపాటు
- నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ
నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారని, నేడు మాట మార్చారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మాట మార్చుడు, మడమ తిప్పుడుకు సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు.
వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని నాడు హామీ ఇచ్చారని, రెండున్నరేళ్లు అయినా దిక్కులేదని వ్యాఖ్యానించారు. పైగా, జగన్ కు అవగాహన లేకనే సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారని స్వయంగా సలహాదారుడు సజ్జల ప్రకటించారని, ఇది ఉద్యోగులను దారుణంగా మోసగించడమేనని ఆరోపించారు. నెరవేర్చని హామీలు ఇచ్చి వంచించినందుకు సీఎం జగన్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.