Omicron: రెండు డోసులతో ఒమిక్రాన్ ను ఎదుర్కోవడం కష్టమే!: ఆక్స్ ఫర్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Oxford researchers studies on two dose vaccine efficiency over Omicron

  • ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కలవరం
  • వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్
  • అధ్యయనం చేపట్టిన ఆక్స్ ఫర్డ్ వర్సిటీ
  • మూడో డోసు అవసరమేనంటున్న పరిశోధకులు

ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే ఒమిక్రాన్ నుంచి రక్షణ కలుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఈ నయా వేరియంట్ పై ఎంత ప్రభావం చూపుతాయన్నది సందేహాస్పదంగానే ఉంది.

ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఒమిక్రాన్ పై వ్యాక్సిన్ల సమర్థత అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్నవారిపై పరిశోధన చేపట్టారు. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఉత్పన్నమైన యాంటీబాడీలు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని, ఒమిక్రాన్ పై మాత్రం స్వల్పంగానే పోరాడుతున్నాయని గుర్తించారు.

ఒమిక్రాన్ వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కోవాలంటే మూడో డోసు (బూస్టర్) అవసరం అని అర్థమవుతోందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు వెల్లడించారు. మూడో డోసు పొందిన వారిలో ఒమిక్రాన్ పై యాంటీబాడీలు సమర్థంగా పోరాడినట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని వారు వివరించారు.

కాగా, బ్రిటన్ లో ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా పరిగణిస్తున్నారు. ఇకపై దాన్ని సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ పార్లమెంటులో సూత్రప్రాయంగా తెలిపారు. మూడు డోసులు తీసుకున్నవారినే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా పరిగణిస్తామని పేర్కొన్నారు.

అయితే ఇది బ్రిటన్ వాసులకే వర్తిస్తుందా? లేక బ్రిటన్ వచ్చే విదేశీయులకు కూడా వర్తిస్తుందా? అనేదానిపై స్పష్టత రాలేదు. అనేక దేశాల్లో రెండు డోసులు తీసుకున్నవారిని ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా పరిగణిస్తున్నారు. బ్రిటన్ లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే విదేశీయులు బ్రిటన్ లో అడుగుపెట్టడం కష్టతరం అయ్యే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News