Karnataka: గాల్లో చక్కర్లు కొట్టి భయపెట్టిన విమానం.. అందులో కర్ణాటక సీఎం బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
- బెంగళూరు నుంచి హుబ్బళ్లికి బయలుదేరిన సీఎం
- హుబ్బళ్లి ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం
- గాల్లోనే విమానం చక్కర్లు
- అరగంట తర్వాత సురక్షితంగా ల్యాండింగ్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయాణిస్తున్న విమానం అరగంటపాటు గాలిలో చక్కర్లు కొట్టడం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి బొమ్మై నిన్న బెంగళూరు నుంచి విమానంలో హుబ్బళ్లికి బయలుదేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఆయన వెంట ఉన్నారు.
వీరు ప్రయాణిస్తున్న విమానం హుబ్బళ్లికి చేరుకునే సరికి వాతావరణం సంక్లిష్టంగా మారింది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో రన్‌వే కనిపించలేదు. ఫలితంగా ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో విమానాన్ని మంగళూరు తరలించాలని భావించారు. ఈ క్రమంలో విమానం అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానం ల్యాండ్ అయింది. దీంతో అప్పటి వరకు ఉత్కంఠగా గడిపిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.