Bipin Rawat: బిపిన్ రావత్ కన్నుమూత... అధికారికంగా ప్రకటించిన భారత వాయుసేన
- తమిళనాడులో ఘోర ప్రమాదం
- నీలగిరి వద్ద కుప్పకూలిన హెలికాప్టర్
- రావత్ తో పాటు ఆయన భార్య కూడా మృతి
- మరో 11 మంది దుర్మరణం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
భారత త్రివిధ దళాల చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఆయన అర్ధాంగి మధూలిక రావత్ కూడా కన్నుమూశారు. మరో 10 మంది సైనికాధికారులు, హెలికాప్టర్ పైలెట్ కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. ఈ మేరకు రావత్ మృతిని భారత వాయుసేన కొద్దిసేపటి కిందట ధ్రువీకరించింది.
ప్రమాదం జరిగిన తర్వాత రావత్ ప్రాణాలతో ఉన్నారని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది. అయితే రావత్ సంఘటన స్థలంలోనే చనిపోయినట్టు వెల్లడైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని భారత వాయుసేన ప్రకటించింది. రావత్ మరణంతో సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బతికే ఉన్నారన్న వార్తతో యావత్ దేశం ప్రార్థిస్తోంది. కానీ ఇప్పుడీ మరణవార్త అందరినీ బాధిస్తోంది.