Abhijit Banerjee: భారత ప్రజల చిన్నచిన్న ఆశలు సైతం ఆవిరైపోతున్నాయి: నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
- భారత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు
- దేశ ఆర్థిక వ్యవస్థ 2019 స్థాయి కంటే కిందే ఉంది
- పది రోజులు తీహార్ జైలులో గడిపాను
- శ్యాం బెనగల్, సత్యజిత్ రే భిన్నమైన రంగాల్లో రాణించారు
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ.. భారత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 స్థాయి కంటే కిందే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చిన్నచిన్న ఆశలు సైతం చితికిపోతున్నాయని అన్నారు. అయితే, ఇందుకు తాను ఎవరినీ బాధ్యులను చేయాలనుకోవడం లేదన్నారు. విద్యార్థులు తమ గమ్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో ఈ సందర్భంగా వారికి సూచించారు.
ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుకుంటున్న సమయంలో తాను 10 రోజులు తీహార్ జైలులో గడిపినట్టు చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనతో తన భవిష్యత్తు ఇక ముగిసినట్టేనని చాలామంది బెదిరించారని, కానీ అలా జరగలేదని గుర్తు చేసుకున్నారు. నచ్చిన రంగంలో రాణించేందుకు ధైర్యంగా ముందడుగు వేయాలని విద్యార్థులకు సూచించిన అభిజిత్.. దిగ్గజ దర్శకులు సత్యజిత్ రే, శ్యామ్ బెనగళ్ ఇద్దరూ ఎకనామిక్స్‌లో పట్టభద్రులని గుర్తు చేశారు. కానీ వారు భిన్నమైన రంగంలోకి ప్రవేశించి భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.