Congress: కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన కాంగ్రెస్ రెబల్ గులామ్ నబీ ఆజాద్
- జమ్మూకశ్మీర్‌లో ఆజాద్ విస్తృత సమావేశాలు
- సొంత కుంపటి పెట్టుకోబోతున్నారంటూ వార్తలు
- అలాంటిదేమీ లేదన్న ఆజాద్
- భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్న సీనియర్ నేత
- ఇందిర, రాజీవ్ హయాంలోనూ విమర్శలకు స్థానం ఉండేదన్న ఆజాద్
తాను సొంతపార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ప్రస్తుతానికైతే తనకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం తెలుసని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఆజాద్ ఇటీవల విస్తృతంగా సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయనీ వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఆజాద్ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరుస సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనికితోడు ఆయన సన్నిహితులు 20 మంది వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాంరాం చెప్పి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి.
నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆజాద్ మాట్లాడుతూ.. సొంతపార్టీపై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలోనూ పార్టీలో విమర్శలకు స్థానం ఉండేదని, విమర్శించడాన్ని వారు తప్పుగా ఎప్పుడూ భావించలేదన్నారు. కానీ ఇప్పుడు వాటికి చోటు ఉండడం లేదని అన్నారు. ఇందిరా గాంధీ అప్పట్లో ఇద్దరు ప్రధాన కార్యదర్శలును నియమించాలని భావించారని అయితే, దానిని తాను తిరస్కరించడంతో ఆమె కూడా సరేనని అన్నారని ఆజాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పార్టీ మేలు కోసమే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు రాజీవ్‌గాంధీతో ఇందిర చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడలా చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చెప్పినందుకు తాము పార్టీలో అపరిచితులమై పోతున్నామని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.