COVID19: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయ్.. దేశంలో మరొకటి నమోదు

Another Omicron Variant Case Found In Delhi

  • ఐదుకు పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
  • ఢిల్లీలో తొలి కేసు గుర్తింపు
  • టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కన్ఫర్మ్
  • దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు 

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు బయటపడగా.. తాజాగా మరొక కేసు నమోదైంది. బెంగళూరులో 2, గుజరాత్ లో ఒకటి, మహారాష్ట్రలో ఒక కేసు నమోదవగా.. ఇప్పుడు ఢిల్లీలోనూ మరో కేసు వచ్చింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో దానిని గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. ఒమిక్రాన్ ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని ఢిల్లీలోని ఎల్ ఎన్ జేపీ ఆసుపత్రిలో చేర్పించామని, వారిపై నిఘా పెట్టామని తెలిపారు. అందరికీ చికిత్స చేస్తున్నామన్నారు.

కాగా, ఇవాళ సౌదీ నుంచి నాగ్ పూర్ కు వచ్చిన ఎయిర్ అరేబియా ఫ్లైట్ లోని 95 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. కాగా, వ్యాక్సినేషన్ ను పుదుచ్చేరి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య చట్టం ప్రకారం ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2,796 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. యాక్టివ్ కేసులు 99,155 ఉన్నట్టు ప్రకటించింది. ఇవాళ బీహార్ ప్రభుత్వం మరణాల లెక్కలను సవరించింది. 2,426 మరణాలను లిస్టులో చేర్చింది. కేరళ కూడా 263 మరణాలను చేర్చింది. దీంతో ఈ మరణాలనూ తాజా మరణాలకు కలిపి లెక్కల్లో చూపించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో సగం మందికిపైగా పెద్దలకు రెండు డోసుల వ్యాక్సిన్ ను వేసినట్టు ప్రకటించింది. ఇప్పటిదాకా 127,61,83,065 డోసుల టీకాలు వేసినట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News