DeVilliers: ఆర్బీబీతో డివిలియర్స్ అనుబంధం కొనసాగేనా...?
- ఇటీవల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డివిలియర్స్
- అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
- ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా వచ్చే అవకాశం
- ఏబీ వస్తే ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ప్రయోజనమన్న బంగర్
క్రికెట్ మైదానంలో అన్ని వైపులకు సిక్సర్లు కొట్టగలిగిన మొనగాడు ఏబీ డివిలియర్స్. ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం ఇటీవలే అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అనేక రోమాంఛక ఇన్నింగ్స్ లు ఆడిన డివిలియర్స్ వచ్చే సీజన్ నుంచి మైదానంలో కనిపించడన్న నిజం అభిమానులను విచారానికి గురిచేస్తోంది.
అయితే, ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఏంటంటే... ఏబీ డివిలియర్స్ సేవలను మరోలా ఉపయోగించుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ ను నియమించాలన్నది ఓ ప్రతిపాదనగా తెలుస్తోంది.
ఆర్సీబీ చీఫ్ కోచ్ సంజయ్ బంగర్ ఏమంటున్నాడంటే... డివిలియర్స్ వంటి ఆటగాడు బ్యాటింగ్ కోచ్ అయితే జట్టుకు, ఆటగాళ్లకు ఎంతో లాభిస్తుందని పేర్కొన్నాడు. పైగా, క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు కొత్త పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది ఏబీని ఉద్దేశించేనని అభిమానులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ వేలం ఉండగా, ఈ లోపే ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ నియామకం జరిగే అవకాశాలు ఉన్నాయి.