Talasani: సినిమా థియేటర్ల మూసివేత అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి తలసాని స్పందన

Talasani clarifies on cinema theaters and omicron scares

  • తెలంగాణలోనూ ఒమిక్రాన్ భయాలు
  • థియేటర్ల మూసివేత అంటూ ప్రచారం
  • మంత్రి తలసానిని కలిసిన టాలీవుడ్ ప్రముఖులు
  • టాలీవుడ్ కు భరోసా ఇచ్చిన మంత్రి తలసాని

ఒమిక్రాన్ వేరియంట్ కలకలం కారణంగా తెలంగాణలో మళ్లీ సినిమా థియేటర్లు మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అపోహలు నమ్మవద్దని స్పష్టం చేశారు. మంత్రి తలసానిని ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు మాసాబ్ ట్యాంక్ లోని ఆయన కార్యాలయంలో కలిశారు. నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, రాధాకృష్ణ, సునీల్ నారంగ్, ఎర్నేని నవీన్, వంశీ, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తలసానితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆయనతో చర్చించారు.

ఈ భేటీ అనంతరం తలసాని మాట్లాడుతూ, సినిమా హాళ్ల మూసివేత, థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తెలిపారు. ప్రజలు థియేటర్లలో సినిమాలు చూడాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని ఉద్ఘాటించారు.

ఇక టికెట్ ధరల పెంపు అంశంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఓ పరిష్కారం కనుగొంటామని వెల్లడించారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News