Evie Toombes: నన్నెందుకు ఇలా పుట్టించారు.. తల్లికి వైద్యం చేసిన డాక్టర్ పై ఓ యువతి న్యాయపోరాటం
- బ్రిటన్ లో ఘటన
- స్పైనా బిఫిడా లోపంతో బాధపడుతున్న ఈవీ
- తన తల్లికి డాక్టర్ సరైన సూచన చేయలేదని కోర్టుకు ఫిర్యాదు
- విచారణ జరిపిన కోర్టు
- పరిహారం చెల్లించాలని డాక్టర్ కు ఆదేశాలు
బ్రిటన్ లో ఓ ఆసక్తికరమైన ఉదంతం వెలుగుచూసింది. తాను జన్మతః ఓ లోపంతో పుట్టానని, తన తల్లి గర్భంతో ఉన్నప్పుడు చికిత్స చేసిన వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. ఆమె పేరు ఈవీ టూంబ్స్. ఈవీ బ్రిటన్ లో గుర్రాలపై విన్యాసాలు చేసే షో జంపర్ గా పేరుపొందింది. అయితే ఆమెకు పుట్టుకతోనే స్పైనా బిఫిడా అనే లోపం ఏర్పడింది. దాంతో కొన్నిసార్లు ఆమె రోజంతా శరీరానికి ట్యూబులు అమర్చుకోవాల్సి ఉంటుంది.
తనకు ఈ దురవస్థ రావడానికి కారణం తన తల్లికి వైద్యం చేసిన డాక్టర్ ఫిలిప్ మిచెల్ అని ఆమె భావించింది. తన తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు వైద్యపరంగా సరైన సలహాలు ఇవ్వడంలో డాక్టర్ మిచెల్ విఫలం అయ్యారంటూ ఈవీ కోర్టులో దావా వేసింది. తగినంత మోతాదులో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలని తన తల్లికి డాక్టర్ సూచించి ఉంటే, తనకు ఈ లోపం ఏర్పడేది కాదని, దీనికి ఆ డాక్టర్ నే బాధ్యుడ్ని చేయాలని 20 ఏళ్ల ఈవీ కోర్టును కోరింది.
స్పైనా బిఫిడా లోపంపై తన తల్లిని డాక్టర్ అప్రమత్తం చేసుంటే ఆమె గర్భాన్ని కొనసాగించేది కాదని, తాను అసలు జన్మించే దాన్నే కాదని వివరించింది. ఈ కేసును అరుదైన వ్యవహారంగా భావించిన న్యాయస్థానం దీనిపై సమగ్రంగా విచారణ జరిపింది. ఈవీకి భారీగా పరిహారం చెల్లించాలంటూ సదరు డాక్టర్ ను ఆదేశించింది. ఈవీ స్పైనా బిఫిడా లోపంతో జన్మించడానికి కారణం డాక్టర్ అలసత్వమేనని కోర్టు కూడా నిర్ధారించింది.