Kanakamedala Ravindra Kumar: ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందని వైసీపీ సభ్యుడే చెప్పారు: కనకమేడల
- ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు
- మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీలు
- చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కనకమేడల
- జగన్ వల్లే రాష్ట్రం అప్పులపాలైందని ఆరోపణ
పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కనకమేడల అన్నారు. అయితే రాష్ట్ర దుస్థితికి చంద్రబాబే కారణమని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి చంద్రబాబు విధానాలే కారణమని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందని లోక్ సభలో వైసీపీ సభ్యుడు భరత్ స్వయంగా చెప్పారని కనకమేడల వెల్లడించారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భరత్ తెలిపారని వివరించారు. మరో ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇదే అంశాన్ని జీరో అవర్ లో లేవనెత్తారని కనకమేడల పేర్కొన్నారు.
జగన్ విధానాలే రాష్ట్రాన్ని పతనం దిశగా నడిపిస్తున్నాయని ఆరోపించారు. జగన్ వచ్చిన తర్వాత రూ.3 లక్షల 8 వేల కోట్ల మేర అప్పులు చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే అప్పులు చేశారని ప్రచారం చేస్తున్నప్పుడు రాష్ట్ర సర్కారు ఆ మేరకు శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని కనకమేడల వ్యాఖ్యానించారు. అప్పులు చేసింది వైసీపీ సర్కారు అయితే, దాన్ని చంద్రబాబుపైకి నెట్టడం దుర్మార్గమని అన్నారు.
అటు, రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు.