Parliament: సభలోకి దిండు పట్టుకొచ్చిన ఎంపీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్

MP Protest with Pillow Speaker Fires On Him

  • కనీస మద్దతు ధర చట్టం చేయాలంటూ నినాదాలు
  • ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ రాజ్యసభలో డిమాండ్
  • మంత్రి ఇంట్లో పేపర్లు దొంగిలించినా పశ్చాత్తాపం లేదా? అని వెంకయ్య ఫైర్
  • అలాంటప్పుడు సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన
  • బిల్లులపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి

పార్లమెంట్ లో అదే గందరగోళం నెలకొంది. వాయిదాల నడుమ ఉభయ సభలు నడుస్తున్నాయి. 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళనలు చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. లోక్ సభలో ఎంపీలు కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ నినాదాలు చేశారు. ఓ ఎంపీ దిండు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిరసనను మానుకున్నారు.

రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తేయాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేసినా చైర్మన్ వెంకయ్య నాయుడు అంగీకరించలేదు. మంత్రి ఇంటి నుంచి పేపర్లు దొంగిలించిన ఎంపీలు.. వెల్ లోకి వచ్చి పేపర్లు విసిరేసిన ఎంపీలకు.. పశ్చాత్తాపం లేనప్పుడు సస్పెన్షన్ నూ ఎత్తేసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.

నిరసనల మధ్యే పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. డ్యామ్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టారు. డ్యాములపై నిఘా, పర్యవేక్షణ, నిర్వహణ వంటి విషయాలను బిల్లులో పొందుపరిచారు. మధ్యాహ్నం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సభలో చర్చించనున్నారు. సభ్యులకు దానిపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దాని మీద చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. కాగా, శీతాకాల సమావేశాలు పూర్తయ్యే డిసెంబర్ 23 దాకా ఆందోళనలు చెయ్యాలని సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డోలా సేన్, శాంత ఛెత్రి నిర్ణయించారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నిరసన తెలియజేయనున్నారు.

కాగా, ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనను మహాత్మ గాంధీ చూస్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అసలు పార్లమెంట్ ను సజావుగా నడిపే ఉద్దేశం ప్రభుత్వానికుందా? అని ప్రశ్నించారు. ఇతరులూ గళాన్ని వినిపించే హక్కుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. పార్లమెంట్ ఉన్నది చర్చల కోసమని, కాబట్టి ఇతర ఎంపీల అభిప్రాయాలనూ వ్యక్తం చేయనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, బిల్లులపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాల ఎంపీలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నేతలు నిరసన చేపట్టారు.

Parliament
Winter Session
Lok Sabha
Rajya Sabha
  • Loading...

More Telugu News