Sirivennela: తెలుగు పాటను సిరివెన్నెల కొత్తపుంతలు తొక్కించారు: పవన్ కల్యాణ్
- సిరివెన్నెల అంటేనే ఆత్మీయత
- వ్యక్తిగతంగాను నాకు తీరని లోటే
- ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి
- నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
తెలుగు పాటను సిరివెన్నెల మరింత పరిమళింపజేశారు .. తెలుగు ప్రేక్షకులను మరింతగా పరవశింపజేశారు. ఆత్రేయ .. ఆరుద్ర .. శ్రీశ్రీ .. దేవులపల్లి .. సినారె సాహిత్యంలోని శైలి ఒక సిరివెన్నెలలోనే కనిపించేది. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఒక నక్షత్రమై మెరిసింది. జాబిలమ్మనే తన పాటతో నిద్రబుచ్చిన గేయరచయిత ఆయన.
అలాంటి ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించడం పట్ల సన్నిహితులు .. సాహితీ అభిమానులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఆయన అక్షరాల సమక్షంలో ఆవేదన చెందుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది.
ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది. సినీపరిశ్రమకే కాదు, సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన మరణం వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటే. నా పట్ల ఆయన ఎంతో ఆత్మీయతను కనబరిచేవారు. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయవాదం .. సామ్యవాదం వరకూ అన్ని అంశాలను గురించి తన పాటల్లో చెప్పేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.