Andhra Pradesh: పుస్తకాల్లో ఓ పేజీ ఇంగ్లిష్.. ఓ పేజీ తెలుగులో ఉండేలా పాఠాల ముద్రణ: ఏపీ సీఎం జగన్

CM Jagan Releases 3rd Phase Vidya Deevena Funds

  • మూడో విడత విద్యాదీవెన నిధులు రూ.686 కోట్లు విడుదల
  • 11.03 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ
  • కాలేజీలకు తప్పకుండా కట్టాలని సూచన
  • లేదంటే తామే కాలేజీలకు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని కామెంట్

చదువులకు పేదరికం అడ్డు కారాదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉన్నత చదువులతోనే పేదల తలరాతలు మారుతాయని, అందుకే ప్రతి పేద విద్యార్థికీ చదువు అందేలా పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ఇవాళ విద్యాదీవెన కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందిస్తున్నామని, తల్లుల ఖాతాల్లో జమ అయిన డబ్బును కాలేజీలకు తప్పనిసరిగా ఫీజుగా కట్టాలని ఆయన సూచించారు. లేకపోతే నేరుగా కాలేజీలకే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నామన్నారు.

వైఎస్ తర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ను దెబ్బతీశాయని, కాలేజీలకు బకాయిలు పెట్టారని ఆయన అన్నారు. అలాంటప్పుడు నాణ్యమైన విద్య కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఫీజురీయింబర్స్ మెంట్ ను చెల్లించని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను కాలేజీలు పరీక్షలు రాయనివ్వకుండా చేసిన ఉదంతాలను చూశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి మూడు నెలలకోసారి ఫీజును జమ చేస్తున్నామన్నారు.

కాలేజీలో వసతులు, పరిస్థితులను తెలుసుకుని లోటు పాట్లు ఉంటే ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే.. ఫీజును తల్లిదండ్రులతో కట్టిస్తున్నామని చెప్పారు. దాని వల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులకూ మెడిసిన్, డెంటల్ కోర్సుల్లో యాభై శాతం సీట్లను ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీల్లో కేటాయించేలా చట్టం చేశామని గుర్తు చేశారు. ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కేటాయిస్తున్నామన్నారు.
ఉన్నత విద్య కోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు పెరిగిందన్నారు. జీఈఆర్ రేషియో 35.2 శాతానికి పెరిగిందన్నారు. ఈ రేషియో దేశ సగటు 3.04 శాతమైతే.. రాష్ట్ర సగటు 8.6 శాతంగా ఉందని చెప్పారు. ఎస్సీల్లో 7.52 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, బాలికల్లో 11.03 శాతంగా జీఈఆర్ నమోదైందన్నారు. కాగా, జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సుల స్టూడెంట్లకు రూ.20 వేలు ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

సీఎం జగన్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు

  • ఇంగ్లిష్ మీడియంవైపు అడుగులు. పుస్తకాల్లో ఒక పేజీ ఇంగ్లిష్, ఇంకో పేజీ తెలుగులో ఉండేలా పాఠ్యాంశాల ముద్రణ
  • రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు
  • విజయనగరం జిల్లాలో గురజాడ జేఎన్టీయూ
  • ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు
  • కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ
  • కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో మెడికల్ కాలేజ్.
  • 2019 నుంచి ఇప్పటిదాకా 10 కొత్త డిగ్రీ కాలేజీలు
  • 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పాటు ఒక నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ ఏర్పాటు

  • Loading...

More Telugu News