Clouds: అర్జెంటీనాలో 'పాప్ కార్న్' మేఘాలు... వినువీధిలో వింత!
- కార్డోబా ప్రాంతంలో వింత మేఘాలు
- నవంబరు 13న ఆకాశంలో విస్తుగొలిపేలా మబ్బుల దర్శనం
- వీడియో వైరల్
- నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు
నీళ్లు ఎండవేడిమికి ఆవిరై మేఘాలుగా మారతాయని అందరికీ తెలిసిందే. మబ్బులకు నిర్దిష్టంగా ఓ రూపం అంటూ ఉండదు. అవి గాలి వీచే దిశలో పలు రకాలుగా ఆకారాలు దాల్చుతూ ప్రయాణిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మేఘాల ఆకృతులు అచ్చెరువొందిస్తుంటాయి. తాజాగా అర్జెంటీనాలో మేఘాలు పాప్ కార్న్ ఆకారంలో కనువిందు చేశాయి. అప్పుడే వేపిన పేలాలు ఎలా పొంగుతాయో ఆ రీతిలో కనిపించిన మేఘాలను చూసి అర్జెంటీనా ప్రజలు విస్మయానికి గురయ్యారు.
అర్జెంటీనాలోని కార్డోబా ప్రాంతంలో కాసే గ్రాండే వద్ద ఈ పాప్ కార్న్ మేఘాలను నవంబరు 13న గుర్తించారు. దీన్ని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ గా మారింది. కాగా ఈ రకం మబ్బులను శాస్త్రీయ పరిభాషలో మమ్మాటస్ క్లౌడ్స్ అని పిలుస్తారు. ఈ మబ్బులను చూసి కొందరు ఆందోళనకు గురయ్యారట. ఆ సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో ఇదేమైనా ప్రకృతి వైపరీత్యమేమో అని భయపడ్డారట.
ఇక దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది వాతావరణ మార్పుగా భావించగా, మరికొందరు ఇవి భూమికి సంబంధించిన మేఘాలు కావని, ఏలియన్ల పనే అని సందేహించారు. ఏదేమైనా దీనికి సంబంధించిన వీడియోకి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... ఆ వీడియోని మీరూ చూసేయండి!