Nadendla Manohar: ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి... ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారు: నాదెండ్ల
- చిత్తూరు, కడప జిల్లాల్లో వరద బీభత్సం
- సీఎం జగన్ ఏరియల్ సర్వే
- విమర్శలు గుప్పించిన నాదెండ్ల
- ప్రజలను పట్టించుకోరా అంటూ ఆగ్రహం
- పలకరించే దిక్కు లేకుండా పోయిందని వెల్లడి
ఏపీలో పలు జిల్లాలు ఇప్పటికీ వరద నష్టం నుంచి తేరుకోలేదని, ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర సీఎం ఇల్లు కదలరని, ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
ఓవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. జిల్లాకు రూ.2 కోట్ల సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందని, జగన్ ఏమాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తిగా తయారయ్యారని నాదెండ్ల విమర్శించారు. వరదలతో అతలాకుతలమైన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు నాదెండ్ల ఇవాళ తిరుపతి వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.