Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావొద్దు.. అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు చూడండి: జగన్ ఆదేశం
- వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం
- ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ అక్కడే ఉండి సహాయక చర్యలు చూడాలని ఆదేశం
- బాధితులకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్న సీఎం
- పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అక్కడే ఉండాలన్న జగన్
వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, అక్కడే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉండాలని, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్కడేవైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అన్నారు. పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకునే వరకు బాధితులకు అండగా నిలవాలని కోరారు. అలాగే, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయం కల్పించాలని, పంటలు దెబ్బతిన్న రైతులకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు.