Chandrababu: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

Chandrababu gets emotional in press meet

  • తన భార్యను వైసీపీ నేతలు చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు కంటతడి
  • ఆమె ఏరోజు ఇల్లు దాటి బయటకు రాలేదని వ్యాఖ్య
  • గౌరవసభ అగౌరవసభలా మారిందని ఆవేదన

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని... మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కివెక్కి ఏడ్చారు. దాదాపు రెండు నిమిషాల సేపు మాట్లాడలేకపోయారు. గత రెండున్నరేళ్లుగా తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు.

మన అసెంబ్లీ గౌరవసభలా కాకుండా అగౌరవసభలా మారిందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు తన కింద పనిచేసిన ప్రస్తుత స్పీకర్ తమ్మినేని కూడా ఇప్పుడు తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని విమర్శించారు. కీలక ప్రకటన చేయాలని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. తమ్మినేని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు.  సభలో ఎన్నో చర్చలు చూశామని కానీ ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు తాను ఎవరినీ తిట్టలేదని చంద్రబాబు అన్నారు. ఎంతో మంది గొప్ప నాయకులతో తాను పని చేశానని చెప్పారు. విమర్శలు చేసుకున్నా, ప్రతి విమర్శలు చేసుకున్నా హుందాగా ఉండేవాళ్లమని తెలిపారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్షంపై నీచమైన మాటలు మాట్లాడలేదని చెప్పారు. గతంలో రాజశేఖరరెడ్డి కూడా తన గురించి ఒక మాట మాట్లాడారని... కానీ ఆ తర్వాత మేము కలిసినప్పుడు తనకు క్షమాపణ చెప్పారని అన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను తిట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News