Chandrababu: సభ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు నిన్ననే డిసైడ్ అయ్యారు: మంత్రి కొడాలి

Politics are most important for Chandrababu says Kodali Nani

  • మాధవరెడ్డి, రంగా హత్యలను చంద్రబాబే చేయించారని బయట అనుకుంటున్నారు
  • సింపథీ కోసం చంద్రబాబు ప్రయత్నించారు
  • రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు
  • చంద్రబాబువి మంగమ్మ శపథాలన్న మంత్రి 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు అట్టుడికాయి. మళ్లీ సీఎం అయిన తర్వాతే సభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేస్తూ వెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ... మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్య కేసుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడాలని అన్నారు. ఈ రెండు హత్యలను చంద్రబాబే చేయించారని బయట మాట్లాడుకుంటున్నారని చెప్పారు.

వైయస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారో... బాబు గురించి కూడా అలాగే చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని విషయాలపై చర్చిద్దామని చెపితే... 'నా కుటుంబం గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు' అంటూ సింపథీ కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు సింపథీ చాలా అవసరమని... దీని కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. ముందస్తు ప్లాన్ లో భాగంగానే చంద్రబాబు ఈరోజు ప్రకటన చేశారని... ఈ అంశంపై నిన్ననే టీడీపీ నేతలతో చర్చలు జరిపారని ఆరోపించారు. నిన్న అసెంబ్లీకి చంద్రబాబు రాలేదని... దాదాపు రెండున్నర గంటల సేపు పార్టీ నేతలతో చర్చలు జరిపారని, నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

అన్ని హత్యల గురించీ మాట్లాడదామని మేము చెపితే... నా భార్య గురించి మాట్లాడారు, నా కుటుంబం గురించి మాట్లాడారని చంద్రబాబు చెప్పారని... మోకాలికి, బోడిగుండుకి ముడిపెట్టారని విమర్శించారు. సభ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు నిన్ననే డిసైడ్ అయ్యారని... అనుకున్నట్టుగానే ఈరోజు వెళ్లిపోయారని కొడాలి నాని అన్నారు. రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని చెప్పారు. చంద్రబాబువి మంగమ్మ శపథాలేనని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News