F-35B: సముద్రంలో కూలిపోయిన ఓ యుద్ధ విమానం కోసం రష్యా కంటే ముందే రంగంలోకి దిగిన బ్రిటీష్ నేవీ... ఎందుకంటే...!

British navy set to recover crashed stealth plane

  • మధ్యధరా సముద్రంలో ప్రమాదం
  • కూలిపోయిన బ్రిటీష్ ఎఫ్-35బి పోరాట విమానం
  • విమానం ఖరీదు 100 మిలియన్ పౌండ్లు
  • విమానంలో అత్యంత కీలకమైన టెక్నాలజీ

మధ్యధరా సముద్రంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-35బి లైటెనింగ్ యుద్ధ విమానం తాజాగా కూలిపోయింది. అయితే పైలెట్ ముందే బయటపడ్డాడు. తన సీటుకున్న ఎజెక్ట్ బటన్ నొక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాదానికి గురైన ఆ యుద్ధ విమానం సముద్రం అడుగుభాగానికి చేరింది. ఈ యుద్ధ విమానం కోసం బ్రిటీష్ నేవీ ఆగమేఘాలపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అత్యాధునిక మినియేచర్ జలాంతర్గాములను, ప్రత్యేక బలగాలను, డైవర్లను రంగంలోకి దించింది.

ఏ చిన్న శకలాన్ని కూడా వదిలిపెట్టకుండా సేకరించాలని ఆ ఆపరేషన్ లో పాల్గొంటున్నవారికి ఆదేశాలు అందాయి. ఆ విమానం అంతర్జాతీయ సముద్ర జలాల్లో కూలిపోయినందునే బ్రిటన్ అంత ఆదుర్దా చెందుతోంది. విమాన శకలాలు, ఇతర విడిభాగాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యన్ల చేతుల్లో పడరాదన్నదే బ్రిటీష్ నేవీ అభిమతం. అందుకు బలమైన కారణమే ఉంది.

సముద్రంలో కుప్పకూలిన ఆ ఎఫ్-35బి పోరాట విమానం ఖరీదు 100 మిలియన్ పౌండ్లు. భారత కరెన్సీలో సుమారు రూ.1000 కోట్లు! ఆ విమానం ఖరీదు కంటే కూడా దానిలో ఉన్న టెక్నాలజీ ఎంతో అత్యంత కీలకమైనది. ఈ విమానం ఐదో తరం పోరాట విమానం. గగనతలం నుంచి భూతలం పైకి దాడులు చేయడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. అమెరికాకు చెందిన లాక్ హీడ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది నిట్టనిలువుగా ల్యాండింగ్ అవుతుంది. దీని టేకాఫ్ కు చాలా తక్కువ నిడివి ఉన్న రన్ వే అయినా సరిపోతుంది.

ఇందులో ఎంతో విలువైన స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది గగనతలంలో దూసుకెళుతుంటే ఏ రాడార్లోనూ కనిపించదు. అదే దీని ప్రత్యేకత. ఏదైనా ఒక దేశం మీదుగా ఇది ప్రయాణిస్తున్నా దీన్ని గుర్తించడం దాదాపుగా అసాధ్యం. గుట్టుచప్పుడు కాకుండానే ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రత్యేకమైన సెన్సార్లను ఉపయోగించి శత్రుదేశాల రాడార్లను నిద్రపుచ్చుతుంది! అంత రహస్యంగా సంచరిస్తుంది కాబట్టే దీనికి ప్రపంచంలో అంత డిమాండ్!

అలాంటి విమాన సాంకేతిక పరిజ్ఞానం రష్యన్లకు దొరికితే ఇంకేమైనా ఉందా అని బ్రిటన్, అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రివర్స్ ఇంజినీరింగ్ తో అసలుకు నకలు తయారుచేయడంలో రష్యన్లు దిట్టలు. స్టెల్త్ విమానాలు రష్యా వద్ద ఉంటే తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు చాలాకాలంగా భయపడుతున్నాయి.

ఎఫ్-35కి హైపెర్ఫార్మెన్స్ విమానంగా ఎంతో పేరుంది. ఇది ప్రమాదాలకు గురికావడం చాలా అరుదు. ఇది మధ్యధరా సముద్రంలో నిలిపివుంచిన బ్రిటన్ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ పై నుంచి టేకాఫ్ తీసుకున్న తర్వాత అనూహ్యరీతిలో కుప్పకూలింది. ఈ ప్రమాదం వెనుక శత్రు హస్తం లేదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైలెట్ కు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News