India: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

India reports 8865 new corona cases

  • గత 24 గంటల్లో 8,865 కరోనా కేసుల నమోదు
  • కరోనా కారణంగా 197 మంది మృతి
  • కేరళలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

భారత్ లో కరోనా కేసుల నమోదు భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 11,07,617 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 8,865 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం గత 287 రోజుల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో 11,971 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గడం ఊరటను కలిగిస్తోంది. 24 గంటల్లో కేవలం 197 మరణాలు మాత్రమే సంభవించాయి.

ఇప్పటి వరకు కరోనా వల్ల మన దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,63,852కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,30,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.27 శాతానికి చేరుకుంది. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే 59,75,469 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరుకుంది.  

మరోవైపు కేరళలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కేరళలో 4,547 కరోనా కేసులు నమోదుకాగా... 57 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News