Lord Rama: ప్రకాశం జిల్లాలో సీతారాముల విగ్రహాల నుంచి కన్నీరు
- కొనకనమిట్ల మండలం మునగపాడులో ఘటన
- చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలకలం
- వింతను చూసేందుకు పోటెత్తిన ప్రజలు
- స్వామివారికి కోపం వచ్చిందంటున్న గ్రామస్థులు
ప్రకాశం జిల్లాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కొనకనమిట్ల మండలం మునగపాడులో ఓ రామాలయం ఉంది. ఇక్కడ సీతారాములు విగ్రహాల కళ్ల నుంచి నీళ్లు కారుతుండడం ఇక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఆ నోటా ఈ నోటా పడి చుట్టు పక్కల గ్రామాలన్నింటికి పాకింది. దాంతో ఈ వింతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనిపై ఆలయ పూజారి స్పందిస్తూ, ఇటీవల విగ్రహాలను శుభ్రపరిచే నిమిత్తం చింతపండు రసంతో తుడిచానని, అందువల్ల నీళ్లు కారుతున్నాయేమో అంటూ సందేహం వెలిబుచ్చారు.
గ్రామస్థులు మాత్రం రాములవారికి ఆగ్రహం వచ్చిందని అంటున్నారు. గ్రామంలోని ఆలయంలో గత రెండేళ్లుగా స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహించడం లేదని, అందుకే సీతారాముల విగ్రహాల నుంచి కన్నీరు వస్తోందని చెబుతున్నారు. ఏదేమైనా ఇది చెడు సంకేతం అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్వామివారిని సంతృప్తి పరిచేందుకు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా, గతంలోనూ పలుచోట్ల వేప చెట్టుకు పాలు కారుతున్నాయని, వినాయకుడు పాలు తాగుతున్నాడని అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవి దైవ ఘటనలు అనుకుంటూ ఎవరి నమ్మకాల కొద్దీ వారు భక్తిప్రపత్తులు ప్రదర్శించడం తెలిసిందే.